Tuesday, August 30, 2016

Keep Walking!!

ఇప్పటిదాకా ... పెద్ద  గొడవ !!
 అసల ...తను..  రానంటాడు! .... నా వల్ల కాదంటాడు.. !!
నాకూ  మనసుంది.. !! దానికి ఆశలు , కోరికలు ఉన్నాయి !!
నా జీవితమంతా పరుల కోసమేనా... !! నాకంటూ ఏమీ వద్దా.. అని తెగ గొడవ..!
నాకూ ... మోటివేషన్ ..బలంగా కావాలంటాడు ... !!

ఎంత బ్రతిమాలాను ....!!
నీవు రాకపోతే ...మేమంతా ఏమయిపోవాలి ...!
ఈ జీవ రాశులకు దిక్కేది !!
నీవు ఒక పూట కనిపించక పోతేనే .....రక రకాల ఇబ్బందులు ...ఎన్నో అమరికలు ... ప్రత్యామ్నాయాలు ...
మాయందు దయ ఉంచి... ఉదయించమని ... అన్ని విధాలుగా.. ప్రయత్నించాను ... !!
లేదు ...!! ససేమిరా ... అన్నాడు!! నిష్ఠూరంగా !!
ఇక ...మావి చీకటి బ్రతుకులే... !! వెలుగు లేదని... దుఃఖిస్తుండగా... !!
మెరుపు లాంటి ఒక ఆలోచన...  చటుక్కున...తట్టింది !!

తనకు మోటివేషన్ కావాలి... !! నాకు వెంటనే... మోటివేషన్... స్ఫురించింది... !!
*********************************************************


నీకు మోటివేషన్ ( ప్రేరణ ) కావాలి ...అంతే కదా !!
ఐతే ... నీ అలక మాని , రోజూ లాగే ... తూర్పు దిక్కు నుంచి ...
నీ కిరణ కాంతులను ... సమస్త కోటికి .. జీవాహారంగా .. ప్రసరిస్తూ...
ఒక సారి... దక్షిణ భారతావని లోని ... నాలుగొందల ఏళ్ళు చరిత్ర కలిగిన తెలుగు నగరాన్ని ..
పరికించి చూడు ....!!

నీ సప్త వర్ణ  కిరణాల వెలుగులో ....
తన బంగారు వన్నెలకు మరింత శోభ రాగ...
సిరులొలుకుతూ ... సిగను పైకెత్తి ..
ప్రశాంత వదనంతో... చిరునవ్వులు చిలికిస్తూ ...
హంసలా నడుస్తున్నా...  నలభయ్యేళ్ళ  నవ యువతి....
మీ దైవ లోక .. నారీ మణులకేమాత్రం ...తగ్గని ...అందంతో ... ఆత్మ విశ్వాసంతో ...
తిరుగాడుచుండటను కనులారా ... కంటావు ...!!

తనను ... దర్శించి ...అస్తమించడం మాత్రం  ... మరువద్దే !!
లేదంటే .. చందమామ ...అలగొచ్చు... !!

..... ఇలా చెప్పానో లేదో .... వెంటనే ...  అలక పాన్పు దిగి... తూర్పు దిక్కుగా ..పయనమయ్యే... నా సూర్య మిత్రుడు  !!
                                           *********************


కావున ,  ప్రియ చెలియా ...!!
లోక కల్యాణ నిమిత్తం ... సకల ప్రాణ కోటి బాగు కోసం ....
సమస్త ప్రకృతి నిమిత్తం .... జన జీవనం కోసం ...
ప్రతి ఉదయం... .. ప్రకృతి ఒడిలో.. కాసేపు ... పాద యాత్ర... చేయకూడదూ ....!!








Friday, August 19, 2016

థాంక్ యూ ! మిత్రమా!

నువ్వు ఎప్పటికీ నన్ను జాగ్రత్తగా చూసుకునే మరియు నేను వెళ్లే మార్గాన్ని సులభం చేసే ఉత్తమ స్నేహితురాలివి. నేను ప్రపంచమంతా వెతికినా కూడా నీ కన్నా మంచి స్నేహితురాలు ఉండదు. నీకు ఎప్పటికీ జీవితం యొక్క ఉత్తమమైన వాటినే  ఆశిస్తాను.

 నీ లాంటి స్నేహితురాలిని పొందినందుకు నేను వరాలతో, సంపదతో దీవించబడినట్టుగా అనుకుంటున్నాను.

నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నాకు సహాయం చేసావు, నేను భయపడి ఉన్నప్పుడు నువ్వు నన్ను సురక్షితంగా అనుభూతి చెందేలా చేసావు.


నేను ఏదైనా చెప్పే లోపే నువ్వు అర్థం చేసుకుంటావు. మనది రోజురోజుకి బలపడుతూ ఉండే అపురూప బంధం.


నువ్వే నా ఉత్తమ స్నేహితురాలివి . నేను ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నా వెనుక నిలబడ్డావు. నేను నిరుత్సాహంలో ఉన్నప్పుడు నన్ను ఆనందపరిచావు.


ఈ కృష్ణా పుష్కరాలు ఎప్పటికీ గుర్తుండి పోతాయి! ఈ మహానుభూతినుండి ఇంకా తేరుకోలేకున్నాను!
థాంక్ యూ ! మిత్రమా! ఇంతటి ఆనందాన్ని, అనుభూతిని మనసారా పొందు  పరిచినందుకు!

ఈ  రోజు, నేను నిన్ను మిస్సవుతున్నాను.

Wednesday, August 17, 2016

నువ్వే శ్రేష్టం!

ప్రణామం ప్రణామం ప్రణామం !
ప్రభాత సూర్యునికి ప్రణామం!!

ప్రణామం ప్రణామం ప్రణామం !
సమస్త ప్రకృతికి  ప్రణామం !!

ఉషోదయం, నవోదయం, పూర్ణోదయం!
ప్రియమైన చెలిమికి శుభోదయం !!

మిత్రం సుమిత్రం .. నువ్వే నా సమస్తం !!
గాత్రం, స్తోత్రం, కవిత్వం .. నీకే  పరిమితం!!

నీవే నా ఇష్టం,జ్యేష్టం ... లేదంటేనే  కష్టం !!
ఈ సృష్టిలో, నా దృష్టిలో .. నువ్వే శ్రేష్టం!

ప్రియమైన మిత్రునికి శుభరాత్రి !!


Tuesday, August 16, 2016

నిన్నే తాకుతోంది

నేను కళ్ళకు గంతలు కట్టుకొని ...
మనసు అనే విల్లును ఎక్కుపెట్టి ..
తలపు అనే బాణాన్ని ఏ  దిశలో విసిరినా ...
అది అస్తమానం .. నిన్నే తాకుతోంది ....!
ఆ తలపులను మరింత మధురంగా,  మార్చి.. తిరిగి  నా దరికి చేరువ చేయవా... మిత్రమా !!

Thursday, August 11, 2016

నా దేవత


సమస్యా నాదే ! బాధా నాదే ...!
తన తప్పు, ప్రమేయం లేనే లేదే !
కోపం నాదే ! తాపం నాదే .. !
కడలిలా ఉప్పొంగే కన్నీరు నాదే !

మనసూ నాదే .. కోరిక నాదే !
కొలువుండే ఇంతి  నీవు కాక ఇంకెవరూ  లేరే !
 గమ్యం నాదే ! బాటా నాదే .. !
 దారి చూపిన దేవత నీవే !

 ఇప్పటికీ .. ఎప్పటికీ .. తనే ... నా దేవత !
మాట్లాడినా , మాట్లాడకపోయినా ... !
పట్టించుకొన్నా.. పట్టించుకోకపోయినా ...!
సదా .. తన చెలిమికి, ప్రేమకు   కృతజ్ఞతా పాత్రుడనే ... !




బంగారం

పద్మ వ్యూహం లాంటి హైదరాబాద్ ట్రాఫిక్ ని  ఛేదించుకొని ఇంటికొచ్చేసరికి  రాత్రి తొమ్మిదయింది . భోజనం ముగించుకొని కాసేపు నడుద్దామని క్రిందికి వచ్చిన నన్ను..   చల్లని చిరుగాలి  హాయిగా  తాకి , పలకరించింది.  సాయంత్రం నుండి  కురిసిన  వర్షానికి పులకరించిన పుడమి , పరవశించిన మొక్కలు , చెట్లు  మంచి సుగంధాలను  వెదజల్లుతున్నాయి. ప్రకృతిని ఆస్వాదిస్తూ  సేద తీరుతూ  నడుస్తున్న నాకు అన్యమనస్కంగా  నా మిత్రుడు  వాసు  స్ఫురణకు వచ్చాడు . వారం క్రితం ఫోన్ చేసి మాటలాడిన దగ్గర్నుంచి వాడు ఏదో రకంగా నా మదిలో మెదులుతూనే ఉన్నాడు!
    
ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువయ్యాయని , ఈ ఇబ్బందులు కొత్తవి కాక పోయినా,  వీటి వలన ఆరోగ్యం దెబ్బ తింటోందనీ , సరిగ్గా నిద్ర పట్టడం లేదని...   ఈ సంకట స్థితి నుండి బయటిపడాలంటే దాదాపుగా ఐదు లక్షల పై దాకా అవసరమవుతోందని.. వీలుంటే ఎంతోకంత  సర్దుబాటు చేయమని.. ఓ ఆరు నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పి..  ఫోన్ పెట్టేసాడు !

దిగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ఇపుడే జీవించడం నేర్చుకొంటున్న మాకు, అవసరానికి  పది వేలు సర్దడమే మహా గొప్ప విషయం. ఆ విషయం..   అదే నేపధ్యమున్న వాసు కీ  తెలుసు.  నన్ను డబ్బులు అడగటం కంటే, నాతో బాధలు చెప్పుకొని , కాస్త ఉపశమనం పొందటమే వాడి అసలు ఉద్ధేశ్యమని నాకు అర్థమయింది.  మాకు ఏదైనా పెద్ద మొత్తంలో అవసరమైతే అడిగేది సింగపూర్ లో వున్నా మిత్రుడు రాంబాబు నే ! వాడి దగ్గర మూడు లక్షల వరకు ఆర్నెల్ల క్రితమే తీసుకొన్నాడని చెప్పాడు ! 

మూడేళ్ళ క్రితం వరకు ఏ ఆర్ధిక ఇబ్బందులు లేకుండా , చాలా సంతోషంగా , హాయిగా ఉండేవాడు ! మనకంటూ ఏదైనా అస్సెట్ (ఆస్తి) ఉండాలిరా , అపుడే మనం ఖర్చులు తగ్గించుకొని జాగ్రత్తగా ఉండగలమని చెప్పి, సిటీ శివారులో 200 గజాల ప్లాట్ తీసుకొన్నాడు..   సగం అప్పు చేసి !
నాకు తెలిసి..  అప్పుడు మొదలయ్యాయి వాడి కష్టాలు !  పోయిన సవంత్సరం దాదాపు నలభై లక్షలు పెట్టి, బ్యాంకు లోన్ తీస్కొని రెండు గదుల ఫ్లాట్ తీసుకొన్నాడు ! నెల జీతం మొత్తం లోన్ ఈఎమ్ ఐ  లకే  పోతుంటే ఇంకా కుటుంబ పోషణకు , పిల్లల ఫీజులకు మిగిలేదేముంటుంది!
ఇంకా వాడి మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువే  ! బంధు జనం మరీను ! ఇంట్లో చుట్టాల్లేని రోజులు చాల అరుదుగా ఉంటాయి ! నెలకు 20 నుంచి 30 వేల వరకు అప్పవుంతుందననీ, కష్టంగా ఉంటుందననీ  చెప్పాడు ! పరిస్థితి బాగా దిగ జారిందని అర్థమయింది ! కష్టాల కడలిలో..  సంసార బాధ్యతలను భుజాన వేసుకొని భారంగా ఈదుతున్నాడని బాగా అవగతమైంది !

అన్నీ మెల్లగా సర్దుకుంటాయిలే !... ఆరోగ్యం చాల ముఖ్యమని , నీ మీదే పూర్తిగా ఆధారపడిన కుటుంబం బాగోగులు కూడా నీ బాధ్యత అని... నీకేమైనా ఐతే ..వాళ్ళ పరిస్థితి ఏమిటని .. జాగ్రత్తగా ఉండమని ...నేను ప్రయత్నిస్తానని .. "నారు పోసిన వాడు నీరు పోయడా"? అని ఊరడించానే తప్ప .. ఇప్పటివరకు నేను చేసిందేమి లేదు..  ! సన్నని జల్లు మళ్లీ మొదలవగా.. నడక చాలించి  పైకొచ్చాను  !!

" వాసన్నయ్యా ఇప్పటికి రెండు సార్లు ఫోన్ చేసాడు ! ఫోన్ మర్చిపోయి వెళ్ళారా ? " బుజ్జోడ్ని పడుకోబెడుతూ ... రాగానే అందుకుంది మాధవి   !
"నువ్వు మాట్లాడావా " అంటూ ఫోనందుకున్నాను ! "మీతోనే  ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు.. " అని అంటుండగానే మళ్ళీ ఫోన్ ..మ్రోగింది!

" హలో! మధు .. ఎక్కడరా !! నీకో విషయం చెప్దామని చాల సేపట్నుండి ట్రై చేస్తున్నా! " వాసు గొంతులో ఆనందం ధ్వనించింది !
"నారు పోసిన వాడు ... నీరు పోయడా ...అన్నావుగా! ఆ దేవుడు.. తన ప్రతినిధి గా ..మళ్ళీ ఆ   దేవతనే పంపించాడు  ! అప్సరసలా ఆకాశం నుండి క్రిందికి  వచ్చి , చిరునవ్వులు చిందిస్తూ  నా ఎదుట సాక్షాత్కరించి , వరాలిచ్చి తిరిగి ఆకాశయానం చేసింది . .! ప్రస్తుతానికి  నా  కష్టాలు తీరినట్టే   ... చాల హ్యాపీ గా.. ఉంది రా ఇప్పుడు! " కృతజ్ఞత తో కూడిన ఆరాధన , మనసులో బరువంతా  దిగి తేలిక పడిన భావన ... వాడి మాటల్లో కనిపిస్తోంది !!
"చాల సంతోషం ! నాక్కూడా ఆనందంగా  ఉంది .. ఇంతకీ ఎవర్రా ఆ దేవత మూర్తీ ?"  ఉత్సుకతను ఆపుకోలేక అడిగాను.. !

"అదే చెప్పాను కదా ఒకసారి ! మనం  క్రితం సారి షిర్డీ వెళ్ళినప్పుడు ... ! " అని అన్నాడు . 
ఎవర్రా నాకు గుర్తు రావట్లేదు ! ఇంతగా  సహాయం చేసే వాళ్ళు మనకెవరున్నారు? విపులంగా చెప్పు అన్నాను .

 అప్పుడు మొదలయింది నా మిత్రుని మాటల ధారా ప్రవాహం ! గల గల పారే  గంగా సెలయేరులా..  హృదంతరాళం .. పొంగి పొర్లగా ! తన్మయత్వంతో..... 

నేను మొదటగా తనను మా ఆఫీస్ కాంటీన్ లో చూశాను ! శ్వేత వెన్నెల చంద్ర బింబము వంటి ముఖము ... చల్లని కాంతులు ప్రసరిస్తుండగా .. చిరునవ్వులు చిలికిస్తూ .. నాకేసి చూసి చూడనట్టు .. చూసింది ! ఇప్పటికీ  ఆ దృశ్యం మదిలో అలానే దాగుంది ! అందం, అణుకువ మెండుగా కలిగిన ఆ  ముగ్ద మనోహరి తో ఓ రెండు రోజుల తర్వాత  కూర్చొని రెండు గంటల పాటు మాట్లాడే అవకాశం కలిగింది ! చాల ప్రశాంతంగా , ముక్కు సూటిగా , ఏ బెరుకు లేకుండా .. హుందాగా మాట్లాడారు...  ధైర్యం, తెలివి, సహనం..  అన్ని సమపాళ్లలో కలబోసిన వనిత గా  తోచారు !    ఓ ముప్పై ఏళ్ళుంటాయి ... అని అనుకొన్నా ! తర్వాత..  దాదాపు ఏడాది పాటు తను కనిపించలేదు ! తన పేరు మాత్రం అప్పుడప్పుడూ వింటూ ఉండేవాడిని !!

సరిగ్గా .. ఏడాది తర్వాత.. తను మళ్ళీ ప్రత్యక్షమయింది.  మొదట్లో పెద్దగా మాట్లాడింది ఏమీ లేదు. తన ముక్కు సూటితనం, పనిలో ఓర్పు , నేర్పు, నిజాయితీ , ఖచ్చితత్వం, ఒంటరిగా తన పని తాను చేసుకోవడం, కల్మషం లేని సూటైన మాట తీరు, హాయిగా నవ్వడం, చిలిపితనం, సిరులు కురిసే చిరునవ్వు, నన్ను నాకు తెలియకుండానే తన పట్ల ఆకర్షణ పెంచుకునేలా చేసింది. రోజూ మధ్యాహ్నం అందరం కలిసి భోంచేయడం, ఆ తరువాత కాసేపు నడుస్తూ సరదాగా మాట్లాడుకోవడం, ఇలా మెల్ల మెల్లగా... తనతో సాంగత్యం పెరుగుతూ వచ్చింది. తన అలవాట్లు , అభిరుచులు , వ్యవహారాలు, వ్యాపకాలు   నాకు  భలే నచ్చేవి !  దైవ భక్తి, పరమత సహనం, దయా గుణం మెండుగా ఉండేవి. ప్రతి శని వారం, తను ఒక అనాథాశ్రమంలో పిల్లలకు ఒక పూట ఇంగ్లీష్ పాఠాలు చెపుతూ ఉండేవారు.  అన్నీ సమకూరి  ఉండి  కూడా , చాల సాధారణంగా , ఇతరుల పట్ల ప్రేమగా  ఉండటం నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేస్తూ ఉండేది. నిజాయితీగా , నిక్కచ్చిగా, సామాన్యంగా ఉండటం తననుంచే నేర్చుకున్నాను ! ఒకసారి నన్ను ఏదో కారణం చేత భయంకరంగా తిట్టారు కూడా ! భయమేసింది, రోజంతా విపరీతమైన బాధేసింది. తనను ఇబ్బంది పెట్టాలని కానీ, ఇబ్బంది పడుతుందని కానీ , అసలు ఊహించలేదు.  రాత్రంతా మధనపడి, తప్పు నాదే అని గ్రహించి, తనను మరునాడు ఏదోలా శాంత పరచగలిగాను  ! అప్పటి నుండి తన మీద ఉన్న అభిమానం క్రమంగా బల పడుతూ , అనురాగమై.. ఆరాధన  గా స్థిర పడసాగింది!  " లంచ్ కి వస్తున్నారా ?" అంటూ మొదలైన  ఎస్ ఎమ్ ఎస్ (చిన్న సందేశాలు) శుభోదయం, శుభ రాత్రి చెప్పుకోక పోతే ఎదో కోల్పోయామే..  అనే  భావన కలిగేంత దగ్గరయ్యాము  !

 నేనంటే చాల ప్రేమను కనబరిచే వారు ! నేను యూనిక్ (ఏకైక) అనేవారు ! నా నవ్వు హాయిగా ఉంటుందనే వారు ! ఏదో తెలీని తంత్రం ..అదేదో  "సాధుఇజం" నాలో ఉందనే వారు ! ఎటువంటి అమరికలు లేకుండా, రాజు- పేద భేదం లేకుండా , పుట్టు పూర్వోత్తరాలు చూడకుండా నన్ను నన్నుగా గుర్తించడం, ఇష్ట పడటం నాకు తనపై ఎనలేని ఆరాధనని కలిగించాయి ! ఒక మనిషిని  మనిషి గా చూడగలిగిన, నాకు తెలిసిన అతి కొద్ది మందిలో తను చాల ముందుంటారు ! తన సాంగత్యం నన్ను ఎంతగా ప్రభావం చేసిందంటే  .... చెడు ఆలోచనలు అసలు నా దరి చేరేవే  కావు. తను  లేనప్పుడు మాత్రం అటువంటి ఆలోచనలు వస్తూ ఉండేవి. తాను రాని రోజు నాకు ఏమీ తోచేది కాదు!

 మొదట తనే మా ఇంటికొచ్చింది వాళ్ళ బ్బాయిని తీసుకొని! మా జన్మ ధన్యంగా భావించాము! రోజంతా మాతో సరదాగా గడిపారు ! నాలోని ఆత్మ విశ్వాసాన్ని మరింతగా పెంపొందించారు! ఒకసారి మాటల్లో ..." ఏదైనా మంచి పని ముందుండి మొదలెడితే కావాల్సిన సపోర్ట్ దానికదే దొరుకుతుంది " అన్నారు ! ఇలా ఉండగా ... నేను అద్దెకుంటున్న ఫ్లాట్ అమ్మకానికి పెట్టడం జరిగింది .. ఏం చేయాలో తోచక, నాకు వేరే మార్గం లేక తల్లడిల్లుతున్న సమయంలో.... తన మాటలు గుర్తొచ్చాయి ! తను సపోర్ట్ ఉంటే ఫ్లాట్ కొనుక్కోవచ్చు కదా అని బలంగా నమ్మకం కలిగి .. 
మంచి ఫ్లాట్ చూసి , నచ్చి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాను ! తర్వాత తన సపోర్ట్ కావాలని అడిగాను ! మాటిచ్చారు ! నిలబెట్టుకున్నారు ! తను ఇంత వరకు ఎవరికీ చేబదులు ఇచ్చిందే లేదట ! ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ నాకు కావాల్సిన సాయం చేసారు !ఆ రోజు తను ఆ సపోర్ట్ ఇచ్చి ఉండక పోతే ... నా సొంతింటి కల, పెర్మనంట్ అడ్రస్ ...ఇంకా కల్లలు గానే ఉండేవి! అవసరమైనంత డబ్బు ఇవ్వడమే కాకుండా, వేరొకరి చేత ఇప్పించగలిగారు ! నా ఇంటికి దారి చూపిన మార్గదర్శి ముమ్మాటికీ తనే ! నా కంటికి వెలుగు, బాట తన ప్రోత్సాహమే ! ఇంటికి దారి మాత్రమే కాదు ...ఆ గృహ  ప్రవేశానికి నన్ను నడిపించిన తీరు అమోఘం ! ఆ సహకారం విలువైనది , మరువలేనిది , మరుపురానిది! రిజిస్ట్రేషన్ అయిన మరునాడు మా  ఆనందాన్ని హెచ్చింపజేయడానికి   కుటుంబ సమేతంగా మమ్మల్ని వాళ్ళింటికి  ఆహ్వానించారు .  మాతో  రోజంతా సరదాగా , హుషారుగా గడిపి, ప్రేమాభిమానాల  వర్షం కురిపించి, మమ్ముల్ని తరింప జేశారు .  

 నా సంతోషాలే తన సంతోషాలుగా చేసుకొని , నా బాధల్ని తన బాధలుగా స్వీకరించి నన్ను పలు విధాలా ఆదుకొని , ఆనంద పరిచి .. ఎన్నో ఎన్నెన్నో  తీయని స్మృతులను జీవితం మొత్తం మననం చేసుకొనేలా అవకాశం కల్పించారు. 
 ఆ పరిచయం , చనువు , ఆప్యాయత , అనురాగం, ఆరాధన  ... ఎంత వరకు వెళ్లాయంటే ... తాను లేని రోజు ..గత 15 నెలలుగా నాలో లేనే లేదంటే అతిశయోక్తి కాదు ! అంతగా నా ప్రభావం చూపిన ఏకైక వ్యక్తి,  ఇంతగా స్నేహం పంచిన వ్యక్తి ..  నా జీవితంలో .ఇప్పటివరకు తనే అంటే అతిశయోక్తి కాదు  !   పుడుతూనే కొందరు పుణ్యం కొని తెస్తారట!   మన పుణ్యం కొద్దీ  మనకు   వరాలు ఇస్తారట ... మా కోసం వరమయ్యి  వచ్చిందేమో అని అనిపిస్తూ ఉంటుంది. 

పిల్లలు పడుకొని హాయిగా నిద్రిస్తున్నారు .  మాధవి .. ఎంతసేపు ... పడుకోవడానికి రా అంటూ .. సైగ చేసి వెళ్ళిపోయింది!  వాడి మాటల ప్రవాహానికి అడ్డు తగులుతూ .. " అవును, అప్పుడు చెప్పావు కదా ! .. ఫ్లాట్ కొనేటప్పుడు  ఎవరో మేడం చాల హెల్ప్ చేశారని ! గుర్తుంది " అన్నాను.   "అవునవును .. తనే రా మళ్ళీ " అని  చెప్ప  సాగాడు! 

 ఆ తరువాత .. ఆ స్నేహ మధురిమలను  అలా  ఆస్వాదిస్తూ .. ఆనందిస్తూ ...గడిపేస్తున్న కాలంలో ..  తను ఒక నెల రోజుల పాటు సెలవులో వెళ్లడం.. ఆ వెలితిని, ఎడబాటును  తట్టు కోలేక .. నేను కాస్త ఎక్కువ రియాక్ట్ అవ్వడం.. ఒత్తిడికి లోనవటం జరిగింది.  ఆ సమయంలో అది స్నేహ పరిధిని దాటి , మరో కోణం లో, వికసిస్తూ, విస్తారమై .. తనకు కాస్త ఇబ్బందిని కలిగించేది.  మళ్ళీ మళ్లీ   తను దూరమవడం ... నేను మరలా ఒత్తిడికి గురవడం,  చివరకు వారాంతం రెండు రోజులు కూడా ఎడబాటు గా తోచడం ... ఎటు వైపు వెళ్తున్నామో  తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి ! దాదాపుగా రెండు మూడు నెలలు ఈ సంకట స్థితి కొనసాగింది ! 

ఈ బంధం ఏమిటి ? తను రాకపోతే నాకేంటి? తాను మాట్లాడక పోతే  ఏంటి? నాకెందుకు తననే చూడాలనిపిస్తోంది ! నా మనసంతా, ధ్యాసంతా తనతోనే ఎందుకు నిండి పోయింది ? తాను రాకపోతే .. నా రోజెందుకు గడవదు ? ఇలా ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు !! దేనికీ సరైన సమాధానం లేదు ! ఓ రకంగా చూస్తే ... వీటన్నింటికి సమాధానం.. పిచ్చి ! తనంటే ఏ దో తెలియని పిచ్చి !! ఎన్నో సార్లు అడిగారు.. ఏంటిదంతా? అని.  అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకోవద్దని !  కోపాలు , తాపాలు .. అలకలు! మళ్ళీ మాములవడం, ఆనందంగా ఉండటం .. తిరిగి మళ్ళీ చిన్ని చిన్నిగొడవలు .. అలకలు ! తర్వాత ఓదార్పు , ఇలా ఉండాలి, అలా ఉండాలి  అని అనుకోవడం.. అలవాటై పోయింది! 

ఏం జరుగుతుందో , ఎందుకు ఇలా జరుగుతుందో .. తెలిసి..  తెలియక రోజులు అలా గడిచి పోతుండేవి ! ఇదే విషయం మీద దాదాపు రెండు నెలలు..  గంటల తరబడి చర్చలు  చేసాం.. ! స్పష్టమైన స్పష్టత ఎవరికీ రాలేదు ! తనకైతే కాస్తో కూస్తో స్పష్టత ఉంది కానీ .. నాకైతే బొత్తిగా ఏమీ లేదు !

 ఈ విధంగా సతమతమవుతూ ఉంటే ...  అనవసరమైన, సంబంధం లేని, ఊహా జనితమైన లోకుల మాటలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ , లేని పోనీ ఆంక్షలు తన మీద తానే రుద్దుకొని , మధనపడుతూ , ఆనందాలను ఆవిరి చేస్తూ , నిర్జీవంగా కొంత కాలం గడిపారు తను   ! ఈ పరిస్థితి నాకు ఏ మాత్రం నచ్చలేదు . నేను  ఎంత చెప్పిన వినేది కాదు తను ! సమస్య నాకు , నీకు కాదు అనేది తన ఉద్దేశ్యం కాబోలు ! తనని అంతగా ఇష్టపడే నేను .. ఆరాధించే నేను.. తను సమస్యల్లో ఉంటే  చూడగలనా ! నేను సంతోషంగా ఉండగలనా ! ఎన్నో రకాలుగా ప్రయత్నించి ..కాస్త కుదుట పరచగలిగాను ! ఇంకా సమస్యలు లేకుండా ... ప్రశాంతంగా ఉండాలంటే యథాతథా స్థితి కొనసాగించాలని నిర్ణయించాం ! అంటే ఏది ఎక్కువ కాకూడదు అలాగే తక్కువ కాకూడదు ! అలానే కొనసాగిస్తున్నాం అని అనుకొంటున్నాం .. !!

ఈ లోగా , నా ఆర్ధిక కష్టాలు... కారు దిగి విమానమెక్కాయి! పనుల నిర్వహణ చాల కష్టం అయిపొయింది ! ఇటు ఈ మానసిక సమస్యలు ...అటు ఆ  ఆర్ధిక సమస్యలు ... మెల్లగా లోపల్నుండి .. హెల్త్ మీద ప్రభావం చూపడం ప్రారంభించి , కంటికి నిదురను , వంటికి విశ్రాంతి ని , మనసుకి ప్రశాంతతను దూరం చేసాయి ! ఆనందాల్ని  ఆవిరి చేసాయి !

ఇటువంటి విపరీత నేపధ్యం లో ... నా సొంత  ప్రయత్నాలు ఫలించని తరుణంలో.. తనే నా బాధలను పసిగట్టి .. నాకు విలువైన సలహాలిస్తూ .. 
మాములు స్థితికి రావడానికి ప్రయత్నిస్తూనే.. అసలు సమస్యను తనదైన శైలి లో ..తెలుసుకొని.. విపులంగా మాట్లాడి ..వివరించి.. మరో సారి .. నాకై .. దేవతా రూపం దాల్చి .. తన నేస్తం కష్టాలు తీర్చడానికి సంకల్పించి ... నా మనశ్శాంతి ని, సంతోషాలను , నిదురను  తిరిగి  భద్రంగా .. నా దారికి చేర్చి.. నాపై తన మమతలు, ప్రేమానురాగాలు సజీవంగా నిలిపి, నా హృదయాన్ని ద్రవింప చేసింది ! ఇంతకంటే ఏం  కోరుకుంటాం ..? 
ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో గాని.. ఈ జన్మకు నాకు దేవుడిచ్చిన ప్రత్యక్ష వరం ..ఈ .. నా దేవతే ! 
తన కోసం ఏదైనా  చేయడానికి .. ఆ దేవుడు నాకు అవకాశమివ్వాలని.. సదా వేచి యుంటాను! " 

 నా మిత్రుని పలుకుల ప్రవాహా గంగ ... ఆగింది ! బయట హోరున కురిసిన భీకర వాన కూడా  వెలిసింది ! 
"నువ్వు చాల అదృష్టవంతుడివిరా!  ఇలాంటి స్నేహ హస్తం అంది పుచ్చుకొన్నందుకు నీవు  ధన్యుడివి ,  ఎవరుంటారురా ఇలా ..ఈ కాలం లో "
అని బదులిస్తూ.. మళ్ళీ అడిగాను .. ఇంతకీ ఆ దేవతామూర్తి  పేరేంటి? మాకు దర్శన భాగ్యం ఎప్పుడని !

" తనో .  విరబూసిన మందారం ..పేరు .. మేలిమి బంగారం "

ఉంటారా.. లేటయింది కదా..! శుభ రాత్రి ..అంటూ ఫోన్ పెట్టేసాడు  ! 
ప్రతి ఒక్కరికి ఇటువంటి నేస్తం దొరికితే.. కష్టాలు వారి కను చూపు మేరకైనా రావు కదా ..అని తోచింది ! శభాష్ మిత్రమా .. మన ఫ్రెండ్ సర్కిల్ లో ..అత్యుత్తమా మిత్రత్వం మీదేరా.. మనసులో అనుకొని . ఆ బంగారం లాంటి దేవత మూర్తి కి మనస్సుమాంజలి ఘటిస్తూ.. నిదుర లోకి జారుకున్నాను... !!

******************************************************************************************

నా ప్రియ నేస్తం కోరిక పై ..  తన పుట్టినరోజు కానుకగా.. అలాగే...  ఫ్రెండ్షిప్ డే సందర్బంగా... ఈ కథ  రాసి , అంకితమివ్వాలని తలచి మొదలెట్టాను ...కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ... ఆలస్యం అయింది ! అలాగే కథ కాస్త రూపం కూడా మార్చుకొంది.   క్షమాపణలు !!
















 













Tuesday, August 2, 2016

స్వాతి చినుకు

కల్లా కపటం కానని  .....
అపకారం, హాని ఎరుగని ...
అబద్ధం , అన్యాయం పలకని....
ద్వేషం , మోసం  తెలియని ......
కల్మషం లేని.. స్వచ్ఛమైన మనసు కలిగి...
మొండి పట్టుదల , అసామాన్య ధైర్యం అలవర్చుకుని...
సముద్రమంత కరుణనను,   పుడమియంత ఓర్పును ...
 అపారమైన ప్రేమను, నిండుగా గుండెల్లో దాచుకొని ....
పున్నమి కాంతులు వెదం జల్లే ..ప్రశాంతతను ...
ముఖమున ధరించిన .... సున్నిత మనస్కురాలైన ...ఓ  ప్రియా నేస్తమా !!

ఇదిగో... నింగి కేగి... మేఘమై... ఘనీభవించి ...తదుపరి .. ద్రవించి...
స్వాతి చినుకునై .... నీ ముంగిట నిలిచి... పలుకుతున్నా ....
శుభోదయం! శుభోదయం ! శుభోదయం .... సుమిత్రమా !!