Saturday, May 28, 2016

ఒంటరి పయనం

ఒంటరిగా ....
ఒంటరిగా వేస్తున్నా .... అడుగులు...  ఎటో ....
ఎవరో పిలిచినట్టు అనిపించింది ...  ఆకస్మాత్తుగా ఆగాను !
చుట్టూ చూసాను ! చిత్రంగా !  మాటలు .. వినిపించాయి ! విచిత్రంగా !

అనుక్షణం నీ మనసులో ఆరని జ్యోతిగా వెలిగిన నీ నేస్తం ...
ఇక రాదా మిత్రమా అని అడిగిన ...
ప్రతి వీధి కొమ్మకి, రెమ్మకి ... ఏమని చెప్పను ? మౌనమే నా భాష !
ఇక ఆ వీధుల్లొ నడవకూడదనుకొన్నా ! ఉదయం పూట !

హంసను తలపించే నీ మిత్రుని అడుగులు
ఇక కనపడవా నేస్తం..  అని అడిగిన ...
ప్రతి పావురానికి , పక్షికి .... ఏమని చెప్పను ? మౌనమే నా పలుకు !
మళ్ళీ ఆ వీధుల్లొ నడవకూడదనుకొన్నా ! సాయంత్రం కూడా !

వెన్నెలను కురిపించే నీ చెలి నవ్వులు
ఇక వినపడవా మిత్రమా  .. అని అడిగిన
చందమామకు ... ఏమని చెప్పను? మౌనమే నా సమాధానం !
ఇక వెన్నెలకు దూరంగా ఉండాలనుకొన్నా !

చూపులతోనే మెరుపును మరపించే నీ నెచ్చెలి
ఇక నీ దరి చేరదా నేస్తం .. అని అడిగిన
ఆకాశ తారలకు ... ఏమని చెప్పను?  మౌనమే నా మంత్రం !
ఇక చుక్కలవైపు చూపు వెళ్ళకూడదనుకొన్నా !

గోదారి గలగలలనే...  మాటలుగా చేసుకొన్న ,
నీ మిత్రుని పలుకులు మాయమైనట్లేనా ... అని అడిగిన ...
చల్లని చిరు గాలికి .. ఏమని చెప్పను? మౌనమే నా ఘోష !
ఇక ఆ నిషా పవనాలు .. తాకనీయొద్దనుకొన్నా !

మా రంగులనే ఆనందాలుగా చేసుకొన్నా
మీ మిత్ర ద్వయం ... ఒంటరయిందే !.... అని అడిగిన
ఆ అందాల హరివిల్లుకు ..... ఏమని చెప్పను ? మౌనమే నా యత్నం !

మౌనమే.... మహా ఆభరణంగా ధరించి...  మళ్ళీ మొదలయింది నా పయనం ...
నీకై ...  నా ఒంటరి పయనం ....

No comments:

Post a Comment